ప్రభుత్వ స్థలాల్లో నిర్మించుకున్న ఇండ్లకు పట్టాలివ్వాలి : సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్​వెస్లీ

ప్రభుత్వ స్థలాల్లో నిర్మించుకున్న ఇండ్లకు పట్టాలివ్వాలి : సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్​వెస్లీ

గోదావరిఖని, వెలుగు: ప్రభుత్వ స్థలాల్లో పేదలు నిర్మించుకున్న ఇండ్లకు పట్టాలు ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్​వెస్లీ డిమాండ్​ చేశారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్  ఆఫీస్​ ముందు సీపీఎం ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూపోరాటం చేసి రామగుండం ప్రాంతంలోని నాలుగు చోట్ల 600 మందికి ఇండ్ల స్థలాలు ఇప్పించామని తెలిపారు.

ఆ ఇండ్లకు పట్టాలు ఇవ్వడంతో కాలనీల్లో సౌలతులు కల్పించాలని కోరారు. సింగరేణి, ఎన్టీపీసీల్లో స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని, కాంట్రాక్టు కార్మికులకు రూ.26 వేల కనీస వేతనం చెల్లించాలని డిమాండ్​ చేశారు. రాష్ట్ర బడ్జెట్​లో రైతాంగం, విద్య, వైద్యం, కార్మికరంగాన్ని విస్మరించిందని పేర్కొన్నారు.

కేంద్ర బడ్జెట్​లో కూడా పేదలకు ఒరిగిందేమీ లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా సంపన్నుల కోసం పని చేస్తున్నాయని విమర్శించారు. అనంతరం డిప్యూటీ కమిషనర్  వెంకటస్వామికి వినతిపత్రం అందజేశారు. అంతకుముందు పట్టణంలో బైక్​ ర్యాలీ నిర్వహించారు. బొజ్జ భిక్షమయ్య, భూపాల్, వై.యాకయ్య, వేల్పుల కుమారస్వామి, ముత్యంరావు, ఎం.రామాచారి పాల్గొన్నారు.